4

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
గీతామృతమున చతుర్థాధ్యాయము

జ్ఞానయోగము

1. సూర్యభగవానునకును దెల్పితిని యీ సూత్రమును ప్రేమతో,
మనువునకు దెల్పినాడు సూర్యుండు యీ మహా యోగంబును.

2. ఈ కర్మ యోగంబును దెల్పెను మనువు ఇక్ష్వాకునకును,
ఈ రీతి రాజర్షులు యెఱిగిరి ఈ యోగమార్గంబును.

3. నీ కంటె ముందు పుట్టె సూర్యుండు నీవెట్లు దెల్పినావు,
ఇది యెట్లు పొసగునయ్య శ్రీ కృష్ణ  యెఱిగింపుమయ్య నాకు.

4. కలవు జన్మలు నీకును యెన్నియో అట్టులే కలవు నాకు,
అజ్ఞాన వశము చేత యెఱుగవు ఆ  జన్మ వృత్తాంతముల్.

5. పుట్టుటయు గిట్టుటయును లేనట్టి పుణ్య పురుషుడనగుటచే,
ఎల్ల భూతంబులకును లేనెగా యీశ్వరుండను నిజముగా.

6. అట్టి నాదగు మాయచే జన్మంబులపుడపుడు యెత్తుచుందు,
బంధింపలేదు నన్ను నాచేత బంధింపబడిన మాయ!

7. ధర్మంబు నుద్ధరింప ధరణిలో జన్మముల నెత్తి నేను,
అణచివైచి యధర్మమున్ అట్టి తరి ధర్మంబు నుద్ధరింతు.

8. శిష్టులను రక్షింపగా అట్టులే శిక్షింపగా దుష్టులన్,
జన్మముల నెత్తుచుందు జగతిన్ నాదైన మాయ వలన.

9. జన్మములు కర్మములును నిజముగా జగతిలోలేవు నాకు,
ధర్మంబు నుద్ధరింప ధరణిలో జన్మముల నెత్తుచుందు.

10. ఈ రీతి నా జన్మమున్ కర్మమును నెవ్వడెరుగునొ అర్జునా,
జన్మంబు నెత్తడతడు జగతిలో దేహంబు వీడి పిదప.

11. గుణ కర్మములను బట్టి కులములను నిర్ణయించితి నిజమిది,
కర్తనే గాదంచును నెఱుగుము  కర్మంబులకు నెప్పుడు.

12. కర్మ ఫలముల గోరక ధరణిలో కర్మముల జేయునతని,
కర్మములు బంధింపవు యెప్పుడు కాంక్షయే లేదు గాన.

13. కర్మ ఫలముల గోరక పూర్వులు కర్మలను జేసినారు,
ఆ రీతిగా  నీవును కర్మముల నాచరింపగ వలయును.

14. కర్మ యందునకర్మమున్ మఱియును కర్మమున కర్మయందు,
గాంచుచుండెడు వాడెపో జగతిలో నిజమైన కర్మయోగి.

15. కర్త తానని యెంచక తృప్తుడై కర్మ ఫలముల గోరక,
కర్మమును జేయువాని నెఱుగవలె జగతి నకర్తయనుచు.

16. ప్రాప్తమగు దాని తోడ పండితుడు సంతృప్తి నొంది మదిని,
కర్మ ఫలముల గోరక కర్మముల జేయుచుండును తృప్తుడై.

17. అట్టి వానిని కర్మలు అర్జునా బంధింపజాలవెపుడు,
ఆతడే సన్యాసియు, ఆతడే నిజమైన యోగి సూవె.

18. ధనము చేతను కొందఱు తపముచే మరి కొందఱీ జగతిలో,
స్వాధ్యాయమున కొందఱు  యింద్రియ వశము చే మరి కొందఱు.

19. జప యజ్ఞమును కొందరు జగతిలో జేయుచుందురు ఫల్గునా,
ఈ రీతి బహుభంగుల యజ్ఞముల యిలపైని జేయుచుంద్రు.

20. కర్మతో గూడియుండు యివియన్ని కనుగొనగ ముఖ్యముగను,
జ్ఞానయజ్ఞము శ్రేష్టము జగతిలో ద్రవ్య యజ్ఞమున కన్న.

21. జ్ఞానమున లీనమగును జగతిలో సర్వ కర్మము లెప్పుడు,
జ్ఞానమును బొందినపుడు సిద్ధించు సర్వ కర్మముల ఫలము.

22. అద్దాని తెలియుమోయి అర్జునా ఆచార్యు సేవజేసి,
తత్త్వవిదులపుడు నీకు తత్త్వమును బోధింతురయ్య నిజము.

23. జ్ఞానమున కన్న వేఱె జగతిలో శ్రేష్టమింకొకటి లేదు,
పరమ పావనమైనది ఫల్గునా జ్ఞానమది నిశ్చయముగ.

24. ఆత్మయందే గాంతురు అద్దాని యోగమెఱిగిన వారలు,
పొందెదరు శ్రద్ధ చేత అద్దాని పొందరశ్రద్ధ చేత.

25. శ్రద్ధయును నిగ్రహంబు గల్గిన శ్రమ లేక సిద్ధించును,
అశ్రద్ధతో గూడిన వారలు అద్దాని పొందలేరు.

26. ఆ జ్ఞానమే కల్గిన శ్రేష్టమగు ఆత్మ శాంతియు గల్గును,
అట్టి శాంతిని వేగమే అర్జునా పొందంగ వలయు నీవు.


ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున చతుర్థాధ్యాయము సమాప్తము
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః