14

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున  చతుర్ధశాధ్యాయము

గుణత్రయ విభాగ యోగము

1. దేని గ్రహియించి మునులు శీఘ్రమే దేహముల వీడినారో,
దేనిచే బొందినారో మోక్షమున్ దెలియు మద్దాని నీవు.

2. జ్ఞానంబులకు నెల్లను నుత్తమ జ్ఞానమెద్దియొ ఫల్గునా!
 అద్దాని నెఱుగు వాడు శీఘ్రముగ ఆ బ్రహ్మమును బొందును.

3. అట్టి జ్ఞానంబు చేత అర్జునా! నన్ను బొందిన వారలు,
పుట్టరు గిట్టరెపుడు పుడమిలో నిక్కమిది నమ్ముమోయి.

4. సర్వ భూతంబులకును ప్కృతియె జననియై వరలుచుండ,
పుట్టుకను వానికిచ్చి తండ్రినై పొలుచు చుందును జగతిలో.

5. సత్త్వరజస్తమంబులు మూడును జన్మించి ప్రకృతి యందు,
అవ్యయుండగు దేహిని అర్జునా! బంధించు దేహమందు.    

6. సత్త్వగుణమెన్నగాను స్వచ్ఛమై నిరపాయమై యుండును,
దేహిని బంధించును దేహమును సుఖమందు జ్ఞానమందు.

7. రజోగుణ మెన్నగాను కల్పించు రాగంబు జీవులకును,
కర్మలచె బంధించును జీవుని కలుగనీయదు జ్ఞానమున్.

8. అజ్ఞానమున బుట్టును అర్జునా! ఆ తమోగుణ మెన్నగ,
మాంద్యమున నిద్రయందు బంధించు మఱి ప్రమాదంబునందు.

9. దేహిని బంధించును దేహమును జ్ఞానంబు కలుగనీదు,
మోహంబు గల్గించును జీవుని మోక్షమును బొందనీదు.

10. సౌఖ్యమును గల్గించును దేహికి సత్వగుణ మెన్నగాను,
రజోగుణ మెన్నగాను గల్పించు రాగంబు కర్మములను.

11. మోహమును బుట్టించును తమమది మోక్షమును జెరచునపుడు,
దేహినీ బంధించును దేహమును మోహమును గప్పివైచి.

12. అన్ని ద్వారంబులందు అర్జునా జ్ఞానంబు వెలయుచున్న,
సత్వంబు వృద్ధియందు గలదని చక్కగా యెఱుగుమయ్య.

13. కామ్య కర్మల యెడలను కాంక్షలు గల్గించుచున్న యెడల,
తెలియు మప్పుడు దానిని రజమని తేటతెల్లంబుగాను.

14. మోహమును బుట్టించును జీవుని మోక్షమును జెరచునపుడు,
తెలియు మద్దాని నీవు తమమని తేటతెల్లంబుగాను.

15. సత్వగుణ సంపన్నుడు దేహమును చక్కగా వీడి తాను,
పుణ్యలోకముల బొంది పుట్టును పుణ్యాత్ము లిండ్లయందు.

16. రజోగుణ సంపన్నుడు పుట్టును రాజసుల గృహములందు,
తమోగుణాత్మకుండు పుట్టును తథ్యముగ  పశు గణమున.

17. సత్వంబు వలన గల్గు జ్ఞానంబు సర్వజీవుల కెప్పుడు,
లోభంబు గల్గునెపుడు లోకమున ఆ రజోగుణము వలన.

18. అజ్ఞానమది గల్గును ఫల్గునా! ఆ తమో గుణము కతన,
సాత్వికులు బొందుచుంద్రు సౌఖ్యంబు నూర్ధ్వ లోకంబు లందు.

19. మధ్య లోకము లందున రాజసుల్ మనుచుందురయ్య పార్థ,
తామసులు యెత్తుచుంద్రు తప్పక పశుగణంబున జన్మముల్.

20. గుణములను మూడింటిని వీడి యిల గుణరహితుడైన వాడు,
మోహమును బొందకెపుడు మోక్షమును బొందు నిక్కంబుగాను.

21. గుణములను వీడునట్టి వానిని గుర్తించుటెటులో చెపుమా,
గుణములను వీడునట్టి మార్గమును గుఱుతుగా దెలుపుమయ్య.

22. సత్వరజస్తమంబులు నిక్కముగ సంభవించిన వేళల,
దూరడెన్నడు వానిని కోరడు కోరికలు లేమి చేత.

23. సుఖమును దుఃఖమును సమముగా జూచుచుండును నెప్పుడు,
నిందలను పాటింపడు మరి తాను నిందింప డెవరినైన.

24. మట్టి బంగారంబును మహిలోన సమముగా జూచునతడు,
మానావమానములను సమముగా మది నెంచుచుండు నెపుడు.

25. నన్ను సేవించు వారు మదిలోన నన్నె నమ్మిన వారలు,
గుణములచే పట్టుబడక గుణరహితు నన్ను పొందంగ గలరు.

26. నేనె మోక్షపధంబును నేనెగా శాశ్వతంబగు శాంతిని,
నేనేగా ధర్మంబును మఱియును నేనెగా బ్రహ్మంబును.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన
గీతామృతమున చతుర్ధశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః.