11

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున ఏకాదశాధ్యాయము

విశ్వరూప సందర్శన యోగము


1. అచ్యుతా ప్రేమమీర తెల్పితివి ఆ దివ్య విజ్ఞానము,
దానిచే నశియించెను మోహంబు తత్వమిది బోధ పడియె.

2. నీవు చెప్పినదంతయు వివరింప నిక్కముగ నిజము నిజము,
ఆ రూపమును జూడగా మనసున అభిలాష కలిగెనయ్య.

3. ఆ విశ్వ రూపంబును అర్జునా చూపింతు నీకు నిపుడు,
చూడంగగలవు నీవు యెన్నియో చోద్యంబులను నిజముగ.

4. ఈ నేత్రములు చాలవు యిప్పుడు చూడగా నా రూపమున్,
అందుచే నిత్తు నీకు చూడగా నా దివ్య నేత్రంబుల.

5. అని యిచ్చె అచ్యుతుండు పార్ధునకు ఆ దివ్య నేత్రంబుల,
విజయుండు జూచెనపుడు దీక్షతో నా విశ్వ రూపంబును.

6. బహుముఖంబుల తోడను మరియును బహు నేత్రముల తోడను,
దివ్య భూషల తోడను వెలసెను ఆ దివ్య పురుషుడపుడు.

7. దివ్య వస్త్రముల చేత మరియును దివ్య మాల్యముల చేత,
సర్వంబు వ్యాపించినా యీశుని సర్వేశ్వరుని జూచెను.

8. వేయి సూర్యుల కాంతితో వెలసెను ఆ దివ్యమూర్తి యపుడు,
సర్వ జగముల జూచెను అర్జునుడు సర్వేశు దేహమందు.

9. సర్వ భూతముల జూచె మఱియును సకల మునులను గాంచెను,
పంకజాసను గాంచెను యింకను పన్నగుల గాంచె నందు.

10. బహు తుండముల తోడను మరియును బహూదరముల తోడను,
బహు నేత్రముల తోడను యింకను బహు రూపముల నొప్పెను.       
              
11. శంఖు చక్రముల తోడ వెలసెడి సర్వేశు గాంచెనతడు,
దివ్య దేహము తోడను వెలిగెడు దేవదేవుని గాంచెను.

12. అక్షరుడ వవ్యయుడవు అచ్యుతా! సకలమున కాశ్రయుడవు,
సత్యమును బోషింతువు మఱియును శాశ్వతుండవు నీవెగా.

13. ఆదియును మధ్యంబును అంతమును లేనట్టి వాడవీవు,
సూర్యచంద్రులె నేత్రముల్ నీకు మది చూడ చోద్యంబయ్యెడు.

14.  దశదిశలు నిండినట్టి నీ దివ్యదర్శనము గాంచుచున్న,
జగము వణకుచు నున్నది జగదీశ కావవే భక్తకోటి.

15. పూజ చేయుచు నుండిరి దేవతలు లోకపూజ్యుడవంచును,
స్వస్తి చెప్పుచునుండిరి భక్తితో సిద్ధ సంఘంబు లెల్ల

16. వసువులును రుద్రాదులు వాయువులు ఆదిత్యులున్ రాక్షసుల్,
సిద్ధులును గంధర్వులు  సాధ్యులును సేవించుచున్నవారు

17. భయము నొందుచునున్నవి లోకములు పాలించి రక్షింపవే,
భయము కల్గుచునున్నది పరమేశ నాకును నిశ్చయముగ

18. ఆకాశమున కంటినా నీదైన ఆ రూపమును జూడగా,
కన్పించుచున్నవయ్య కమలాక్ష బహు వర్ణముల మంటలు.

19. బ్రహ్మాది రూపములును బహు విశాలంబైన బాహువులును,
ప్రజ్వలిత  నేత్రంబులు జూడగా భయమగుచు నున్నవయ్య.

20. ప్రళయ కాలము నందలి అగ్ని వలె ప్రబలుచున్న ముఖంబుల,
చూడజాలక యుంటిని జగదీశ చూపవే కరుణ నాపై.

21. ఆచార్యుడును భీష్ముడు అచ్యుతా!  ఆ కౌరవులు అందరు,
ఉభయ సైన్యములందునా వున్నట్టి ఆ యోధవరులందరు.

22. మండుచున్నట్టి నీదు ముఖముల మలమలా మాడుచుండ,
కొందరా పండ్ల మధ్య చిక్కుకొని కుందుచుండగ జూచితిన్.

23. నదులన్నీ శీఘ్రముగను నడచుచు సాగరుని జేరునట్లు,
యీ యుద్ధ వీరులంతా యిప్పుడు నిను జేరుచుండిరయ్య.

24. మండుచుండెడు వహ్నిని మిడుతలు మరి జేరి చచ్చునట్లు,
చచ్చుచుండిరి వీరులు అందరు సర్వేశ నిన్ను జేరి.

25. మండుచున్నట్టి నీదు ముఖముల మడియుచున్నవి లోకముల్,
నీ వెవ్వరో తెలుపుము నిక్కముగ నీ కార్యమేమిటయ్య.

26. కాలమ్మునైన నేను కావింతు లోక సంహారమెపుడు,
నీవు వదలిన వదలను వీరల నిక్కంబుగాను పార్ధ

27. అని సేయుమయ్య నీవు అర్జునా! అనుభవింతువు రాజ్యమున్,
నీవు కారణమైతివి యిచ్చట నేను కార్యంబైతిని

28. మున్నె వీరల జంపితి నీవు యిక మోహంబు వీడుమయ్య,
రణరంగమున  వీరిని రయముగ చంపి జయమును బొందుము.

29. యీ వాక్యములను విన్న విజయుడు యిట్లు పల్కెను భక్తితో,
జగము పొందుచు నున్నది హర్షంబు జగదీశ నిన్ను పొగడి.

30. బ్రహ్మాది దేవతలకు కారణంబైన బ్రహ్మంబీవెగా,
అవ్యయుడ వక్షరుడవు అచ్యుతా! సదసత్పరుడవు.

 31. వాయువును వహ్ని వీవు జగదీశ వరుణుడవు హిమకరుడవు,
తల్లి తండ్రియు నీవెగా దాతవు దాతకుని తండ్రివీవే.

32. విశ్వమంతట నిండిన వాడవు విశ్వేశ్వరుడ వీవెగా,
వందనములయ్య నీకు వేనవేల్ వందనము లందుకొనుము.

33. చనువు చేతను నిన్ను నే సఖుడంచు పిలిచినాడను తెలియక,
అజ్ఞాన వశము చేత యాదవా! అని నిన్ను పిలిచినాడ.

34. నీదు మహిమను దెలియక నిక్కముగ యీ రీతి బల్కినాను,
శిక్షింపకయ్య నన్ను శ్రీకృష్ణ రక్షించి కాపాడుము.

35. సర్వ జగముల కెల్లను బూజ్యుడౌ జనకుడవు నీవెగాదా,
గురువులందున శ్రేష్ఠుడై వెలసెడు గురుదేవుడవు నీవెగా.

36. నీకు సములెవరులేరు నిక్కముగా ఈ మూడు జగములందు,
వందనంబొనరింతును  వాసహి అందుకొని రక్షింపవే.

37. తండ్రి రక్షించునట్లు తనయుని నన్ను రక్షింపుమయ్య,
ప్రియుడు క్షమియించునట్లు ప్రియురాలి నన్ను బ్రోవవె కరుణతో.

38. సఖుడు క్షమియించునట్లు తన సఖుని నన్ను క్షమియింపుమయ్య,
దాసుడై పల్కుచుంటి మాధవ! దాసోహమంచు నేను.

39. మున్ను జూడని రూపమున్ జూచి నే మోదమును బొందినాను,
చూడజాలను దీనిని యిక నేను చూడలేనయ్య నిజము.

40. పుణ్యంబు గట్టుకొనుము శ్రీకృష్ణ పూర్వ రూపమును జూపి,
అని పల్కు అర్జునునకు  యీ రీతి అచ్యుతుడు పల్కినాడు.

41. ఆద్యంతములు లేనిది అర్జునా యీ విశ్వరూపమోయి.
దీని జూడగ జాలరు  యితరులు దివ్య నేత్రము లేమిచే.

42. అట్టి యీ రూపంబును అర్జునా లా యోగ మహిమ వలన,
జూపితిని నీకు నేను యిద్దాని చూడజాలరు నిర్జరుల్.

43. యజ్ఞముల చేతగాని మఱియును యాగముల చేతగాని,
దానముల చేతగాని మఱియును ధర్మముల చేతగాని.

44. ఎఱుగజాలరు యెవ్వరు యీ విశ్వరూపంబు నెప్పుడైన,
అని పల్కుజును కృష్ణుడు చాలించె ఆ విశ్వరూపంబును.

45. సంతసించుచు జూచెను ఫల్గునుడు ఆ సహజరూపంబును,
భయమూ వీడెను చిత్తము బూర్తిగా భక్తి గల్గెను ప్రభునిపై.

46. యజ్ఞమ్ము చేతగాని యెఱుగరు ధ్యానంబు చేతగాని,
దానంబు చేతగాని యెఱుగరు ధ్యానంబు చేతగాని.

47. భక్తి యే ముఖ్యమయ్య నను జేర భక్తియే సాధనంబు,
భక్తి యే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
ఏకాదశాధ్యాయము సమాప్తము.

ఓం తత్ సత్

ఓంశాంతి శాంతి శాంతి.