5

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున పంచమాధ్యాయము
       
కర్మ సన్యాస యోగము

1. సన్యాసమది గొప్పది అందువు చక్కగా నొక్కతూరి,
కర్మ గొప్పది అందువు కనుగొనగ వేఱొక్కతూరి నీవు.

2. వీనిలో గొప్పదేది శ్రీకృష్ణ వివరించి చెప్పుమయ్య,
అద్దాని నాచరింతు అత్యధిక భక్తి శ్రద్ధల తోడను.

3. మోక్షమును బొందుటకును ముఖ్యముగా యివి రెండు మార్గంబులె,
కర్మ మార్గము సులభము శ్రేష్టము కర్మ త్యాగమున కన్న.

4. సుఖదుఃఖములనొకటిగా యెప్పుడు జూచుచుండెడి వానిని,
కర్మబంధములు వీడు అర్జునా కనుగొనగ నుర్వియందు.

5. తెలిసి తెలియని వారలు తెల్పుదురు యివి రెండు వేఱటంచు,
తత్త్వవిధులైనవారు తలతురు యివి రెండు యొకటె యంచు.

6. చిత్త పరిశుద్ధి కొఱకు కర్మలను చేయుచుందురు యోగులు,
కోరరెన్నరు వారలు ఫలమును కుంతీకుమార నిజము.

7. ఫలము గోరక యోగి తా ముక్తుడై పనులు చేయుచునుండగా,
బద్ధుడై జీవించును పామరుడు ఫలములను గోరితాను.

8. కర్మలను సృజియింపడు యీశుడు కర్తనూ సృజియింపడు,
ప్రకృతియే చేయుచుండు యెప్పుడు పరికింప వీనినెల్ల.

9. ఈశ్వరుడు గ్రహియింపడు యెప్పుడు పుణ్య పాపముల నిజము,
అజ్ఞాన వశము చేత జీవులు అతడు గ్రహియింతుడండ్రు.

10. అజ్ఞానమది వీడగా అప్పుడు జీవునకు జ్ఞానమబ్బు,
ఆ జ్ఞానమున గాంచును ఆతడు బ్రహ్మంబు నాత్మయందు.

11. సుఖ దుఃఖములు రెండును చూడగా శాశ్వతంబులు గావని,
కోరరెప్పుడు వానిని ప్రాజ్ఞులు కుంతీకుమార నిజము.

12. ముక్తి గోరెడు జీవుడు యుక్తుడై విడువవలె ద్వంద్వములను,
సర్వ కోర్కెలు వీడిన సజ్జనుడు పొందు శాశ్వత ముక్తిని.

13. కామమును వీడు నతడే గాంచును  శాశ్వతంబగు ముక్తిని,
కామమది శత్రువగుచు జీవులకు కల్గించు జన్మములను.

14. సర్వమయుడను నేనని చక్కగా విశ్వాసమది గల్గినా,
పొందునాతడు శాంతిని పొందును శాశ్వతంబగు ముక్తిని.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన
గీతామృతమున పంచమాధ్యాయము సమాప్తము.

ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః