13

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున త్రయోదశాధ్యాయము

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

1. ఆ ప్రకృతి అది యెట్టిదయ్యా? అచ్యుతా పురుషుడనవాడెవండు?
క్షేత్రమన యెట్టిదయ్యా తెల్పుము క్షేత్రజ్ఞుడనగ నెవరు?

2. జ్ఞానమన జ్ఞేయమనగా నెట్టివో చక్కగా నెఱిగింపవే,
అని పల్కు అర్జునునకు నీరీతి నచ్యుతుడు బల్కినాడు.

3. దేహమును క్షేత్రమంద్రు ఫల్గునా ధీమంతులైన వారు,
క్షేత్రమును నెఱుగువాని చెప్పుదురు క్షేత్రజ్ఞుడంచు పార్ధ.

4. క్షేత్రజ్ఞుడనగ నేనే ఉందును ఎల్ల క్షేత్రములందున,
దేహిని దేహంబును వివరించి తెలుపునదే జ్ఞానమౌను.

5. పంచభూతంబులైదు ఫల్గున బుద్ధి జ్ఞానేంద్రియములు,
కర్మేంద్రియంబులైదు కనుగొనగ శబ్దాది విషయంబులు.

6. సుఖమును దుఃఖమును మఱియును రాగాది ద్వేషంబులు,
గల్గి యుండును దేహము కనుగొనగ నిదియె క్షేత్రంబౌనుగా.

7. ఆత్మ స్తుతి లేకుండుట అర్జున అహంకారము వీడుట,
సహనంబు కల్గియుంట మఱియును శౌచమును బాటించుట.

8. ధైర్యమును కలిగియుంట ఇలపైని ధర్మమును వీడకుంట,
ఆచార్యు సేవించుట యింకను ఆత్మవినిగ్రహంబు.

9. పామరుల వీడియుంట మఱియును బండితుల జేరియుంట,
పుత్రాదులందు మదిని నిక్కముగ బొందనీయక యుండుట.

10. ఆధ్యాత్మమది నిత్యము అంచును నాసక్తి వీడియుంట,
దీనినె జ్ఞానమంచు తెలియుము ఇయ్యదె సత్యమయ్య.

11. అంతటను శీర్షంబులు మఱియును అంతటను నేత్రంబులు,
అంతటను పాదంబులు మఱియును అంతటను జేతులుండు.

12. సర్వ లోకము నందున బ్రహ్మంబు చక్కగా బర్వియుండు,
ఇంద్రియములందుండియు నంటడు ఆ ఇంద్రియముల నెపుడు.                       

13. ఆ బ్రహ్మ మతి సూక్ష్మము అందదు అజ్ఞానులకు నెప్పుడు,
భూతంబులను జేరియు పొందదు ఆభూతముల నెప్పుడు.

14. జ్యోతులకు జ్యోతి యగుచు వెలుగును ఆ పరంజ్యోతి యెపుడు,
జ్ఞానమును జ్ఞేయంబును మరియును జ్ఞానగమ్యంబగుచును.

15. సర్వభూతముల యొక్క హృదయమున చక్కగా వెలుగొందును,
అద్దాని బ్రహ్మమంచు నెఱుగుదురు ఆ బ్రహ్మవేత్తలెపుడు.

16. జ్ఞానమును జ్ఞేయంబును క్షేత్రమును చక్కగా నెఱుగువాడు,
నాయందు మనసు నుంచి పొందును నన్నె నిక్కంబు గాను.

17. ప్రకృతి పురుషుల నెప్పుడు యెఱుగుము పార్ధ!  నిత్యములంచును,
గుణ వికారంబు లెపుడు గుర్తింప గల్గునా ప్రకృతి వలన.

18. గుణములను గోరుక తన జీవుడు గుణియగుచు జన్మలెత్తు,
గుణములే లేకున్నచో బొందును నిర్గుణంబగు ముక్తిని.

19. ఆత్మ చేతను గొందరు పరమాత్ము గాంతురయ్యాత్మ యందే,
జ్ఞాన యోగము చేతను గొందరు ధ్యాన యోగము చేతను.

20. కర్మ యోగము చేతను గొందరు కనుగొందు రయ్యాత్మను,
భక్తి శ్రద్ధల తోడను గొందరు భజియించి కనుగొందురు.

21. అంతటను బర్వియుండు ఆకసము దేనిని అంటనట్లు,
అయ్యాత్మ సోకకుండు దేనిని అతి సూక్ష్మ మగుట వలన.

22. ఒక్కడే సూర్యుడయ్యు వెలిగించు చక్కగా జగము లెల్ల,
అట్లే దేహముల నెల్ల వెలిగించు నా యాత్మ యెపుడు తాను.

23. దేహిని దేహంబును దెలియవలె జ్ఞాన నేత్రము చేతనే,
ఇద్దాని యెరుగు వాడు ముక్తిని యిహముననే పొందగలడు.

24. సర్వ భూతముల యందును ఆత్మను చక్కగా జూచునతడు,
పరమ పదమును బొందును శీఘ్రమే పాపముల నెల్ల వీడి.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబైన
గీతామృతమున త్రయోదశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి  శాంతి శాంతిః