6

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున షష్ఠాధ్యాయము

ఆత్మ సంయమ యోగము

1. కర్మ ఫలమును గోరక యెప్పుడు కర్మలను జేయు వాని,
సన్యాసి యోగి యనుచు శాస్త్రములు చెప్పుచుండును అర్జునా.

2. కర్మ ఫలమును వీడ వలె గాని కర్మముల వీడరాదు,
కర్మములు వీడు వాడు నిజముగా కాడు సన్యాసి వాడు.

3. కర్మమే కద ముఖ్యము జ్ఞానంబు గలుగుటకు  నుర్విలోన,
శాస్త్రములు చెప్పునట్టి కర్మమును శ్రద్ధతో జేయవలయు.

4. సన్యాసమును దెల్పును యోగమని శాస్త్రములు చక్కగాను,
కర్మ ఫలమును వీడక కాగలడే యోగి తానెవ్వడైన.

5. సర్వంబు నీవంచును తెల్పును శాస్త్రములు చక్కగాను,
అట్టి చరి నిన్ను నీవు దెలియవలె ఆత్మజ్ఞానము చేతను.

6. ఇంద్రియంబులు గెల్చిన వానికి యిచ్చునవియె శుభములు,
వశము గారాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును.

7. తన్ను తానెరుగునట్టి వానికి తత్త్వంబు బోధపడును,
తత్త్వ మెఱిగిన జీవుడు గ్రహియించు తానె సర్వంబంచును.

8. సమబుద్ధి గల్గియుండి యోగి తా సంచరించును యెప్పుడు,
శత్రు మిత్రుల నొకటిగా జూచును సమబుద్ధి యున్న కతన.

9. జ్ఞాన విజ్ఞానములచే తృప్తుడై జ్ఞేయమును యెఱుగువాడు,
సర్వంబు తానెయంచు వర్తించు సమబుద్ధి తోడ నెపుడు.

10. యోగసాధన కెప్పుడు యోగ్యంబు యేకాంతవాస ముర్వి,
శుచియు శుభ్రత గల్గినా స్థలములు సుస్థిరత చేకూర్చును.

11. ధర్భాసనంబు మొదట తగినట్టు కృష్ణాజినంబు పిదప,
ఆ పైని వస్త్రముంచి వేయవలె ఆసనము దానిపైని.

12. అటుల గూర్చుండి యోగి చేయవలె ఆ యోగ సాధనంబు,
అటుల జేసెడి వారికి గల్గును ఆత్మ సాక్షాత్కారము.

13. తిండిపోతుకు కుదరదు యోగంబు తినకున్న కుదరదసలే,
యుక్తమగు ఆహారమే గొనవలెను యోగ సాధన కెప్పుడు.

14. యోగంబు సేయుటకును అతినిద్ర యోగ్యమై యుండదెపుడు,
జాగరణ కూడదెపుడు సాధింప యోగంబు నుర్విలోన.

15. యుక్తముగ నుండవలయు అన్నియు యోగంబు సాధింపగా,
అట్లున్నచో యోగము సిద్ధించు నత్యంత సులభము గను.

16. బ్రహ్మమయుడైన వాని పాపంబు జేయకుండెడు వానిని,
శాంతంబు గల వానిని స్వాంతమున గుణములే లేని వాని,

17. పొందునుత్తమ సుఖములు పొందును శాశ్వతంబగు శాంతియు,
అతనినే శరణు బొందు సర్వంబు ఆత్మ తానగుట వలన.

18. సర్వ భూతములయందు  చక్కగా తన్ను దర్శించువాడు,
దర్శించు పరమాత్ముని తప్పక సకల భూతముల యందు.

19. చంచలంబగు మనసును పట్టగా శక్యంబు గాకున్నది,
అద్దాని పట్టుటెట్లో దెల్పుము ఆర్త జన సంరక్షకా!

20. అభ్యాస వైరాగ్యముల్ ముఖముల్ అద్దాని పట్టుటకును,
వాని బొందిన వానికి వశమగును ఆ  బుద్ధి సులభముగను.

21. యోగంబు నభ్యసించు యోగికి సులభంబు మోక్షపదము,
ఆ యోగమే లేనిచో అబ్బదు ఆ మోక్షమెవరికైనా.

22. యోగంబు సలుపుచుండి మధ్యలో యోగంబు నష్టమైన,
అట్టివాడే యోగమున్ బొందును అచ్యుతా తెలుపుమయ్య.

23. యోగంబు చేయుచుండి మధ్యలో యోగంబు నష్టమైన,
పుణ్యలోకముల నొంది తర్వాత పుట్టు శ్రీమంతు లిండ్ల.

24. అట్లు కాదేని అతడు పుట్టును అర్జునా యోగులిండ్ల,
ఇట్టి జన్మము దుర్లభం బిహమున నెట్టి వారల కైనను.

25. పూర్వ పుణ్య వశంబున అట్టుల పుట్టు యోగుల ఇండ్లలో,
యోగమును పూర్తి జేసి యోగి తా బొందు శాశ్వతపదమును.



26. తాపసుల కంటె యోగి  శ్రేష్ఠుడై తనరు చుండును యెప్పుడు,
పండితుల కంటె యోగి యధికుడై  పరుగుచుండును అర్జునా.

27. కర్మగుల కంటె యోగి అధికుడై గాంచు ముక్తిపదంబును,
అటుల గావున నీవును అర్జునా యోగివై వర్ధిల్లుము.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున షష్ఠాధ్యాయము సమాప్తము.

ఓం తత్ సత్
ఓం శాంతి శాంతి శాంతిః