9

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున  నవమాధ్యాయము
రాజవిద్యా రాజగుహ్య యోగము


1. పరమ పావన మైనది యియ్యది బ్రహ్మానుభవ పదమ్ము,
ఆచరించెడు వారికి అతి సుఖము యీ రాజయోగ పధము.

2. ధర్మముల కన్నిటికిని మూలమై తనరు నీ యోగమెపుడు,
భవములను ద్రుంచివైచి భక్తులకు మోక్షంబు గలుగజేయు.

3. అశ్రద్ధ చేత యెవరు దీనిని ఆచరింపక యుందురో,
వారు యెత్తుచునుందురు యెప్పుడు వసుధలో జన్మములను.

4. ఆకాశమందు గాలి అంతటను అంటకయే నుండు రీతి,
నన్ను నంటక యుండును నాలోన భూతములు సుస్థిరముగ.

5. కల్పాంత కాలమందు భూతములు కలసి యుండును మాయతో,
తిరిగి జన్మించుచుండు తెలియ నా భూతములు సృష్ట్యాదిని.

6. ప్రాణులెల్లను జగతిలో పకృతికి వశమైన కారణమున,
పూర్వ కర్మ వశంబున పుట్టును భువు లోన నిక్కముగను.

7. వీటి సృజియింతు నేను వేవేగ కర్మానుసారముగను,
కర్మముల నంటకేను వీనిని కల్పించుచుందు నెపుడు.

8.  బాధింపజాల వెపుడు కర్మలు బంధింపజాల వసలే,
నా మాయ చే జిక్కిన కతమున నన్నేమి చేయవోయి.

9. నేనే ప్రభుడను విభుడను నేనెగా కారణము సృష్టి కెల్ల,
అట్టి నన్నెఱుగలేక మూఢులు అవమానమును జేతురు.

10. పరతత్త్వమును గానక పామరులు దేహంబె తామటంచు,
చింతించు కారణమున వారలు చిక్కుదురు చింతలందు.

11. మూఢులైనట్టి వారు ప్రకృతిచె మోహింప బడిన వారు,
అసుర భావంబునంది అర్జునా నన్నెరుగ జాలరయ్య.                      

12. పుణ్యాత్ములును భక్తులు లోకముచె పూజింపబడు వారలు,
అవ్యయుడనైన నన్ను  యెఱుగుదురు  ఆ దైవ భావంబుచే.

13. యజ్ఞ యాగముల చేత కొందరు అచ్యుతుని ధ్యానింతురు,
జ్ఞాన యజ్ఞమ్ము చేత కొందరు జగదీశు సేవింతురు.

14. విశ్వేశుడైన నన్ను ఈ రీతి వివిధ మార్గముల చేత,
సేవించి పొందుచుంద్రు శీఘ్రముగ శాశ్వతంబగు ముక్తిని.

15. యజ్ఞమును యాగమేను ఆద్యమును ఔషదంబగ్ని నేను,
మంత్రమును కర్మమేను  మహిలోన సర్వంబునకు కర్తను.

16. తల్లియును తండ్రి నేనే దాతయును దైవంబు నేనె సూవె,
వేద్యమగు బ్రహ్మమేను వివరింప ఓంకారమేను గాదె.

17. పతియు గతియును నేనెగ ప్రభుడను సాక్షియును జగతి కేనె,
పుట్టించి పోషించియు గిట్టించు పుణ్యమూర్తిని నేనయా.

18. కర్మ ఫలముల గోరుచు కర్మముల జేయుచుండెడు వారలు,
పుణ్య లోకముల బొంది పూజ్యులై కొంత తడవుండి అచట.

19. పుణ్యంబు క్షీణింపగా వేగమే పుట్టుచుందురు పుడమిలో,
ఈ విధంబుగ వారలు యిహమునకు వచ్చుచూ పోవుచుంద్రు.

20. అన్యచింతన లేకను నన్నెమది ఆశ్రయించెడి వారల,
సర్వభారంబు నేనె వహియింతు సత్యమిది నమ్ముమోయి.

21. దేవతల గొల్చువారు పొందెదరు దేవతలనే యెప్పుడు,
పితరులను గొల్చువారు పొందెదరు ఆ పితృలోకంబుల.

22. భూతముల గొల్చువారు పొందెదరు భూతములనే తప్పక,
నన్ను గొల్చెడు వారలు పొందెదరు నన్నె నిక్కంబు గాను.

23. పుణ్యపాప ఫలంబులు, పుడమిలో గల్గించు జన్మంబుల,
అందుచే యోగివరులు కోరరు ఆ పుణ్య పాపంబుల.

24. దేని తిందువో ఇర్జునా యిక నీవు దేని చేయుచు నుందువో,
ఏ తపంబొనరింతువో యికనీవు దేని వ్రేల్చుచునుందువో.


25. ఆ సర్వమును ప్రేమతో నాకు యిల అర్పించ గలిగితేని,
పొందెదవు నన్ను నీవు నిక్కముగ పొందవిక జన్మంబుల.

26. సర్వ భూతములందున సముడనై వర్తించు నిజము నిజము,
లేడు నాకు విరోధియు మఱి లేడు ప్రియుడనగ వేరొక్కడు.

27. నన్ను భజియించు వారు ఉందురు నా యందు నిక్కముగను,
నేనుందు వారియందునిక్కముగ నన్ను భజియించు కతన.

28. పరమ దుర్మార్గుడైన ఫల్గునా అన్యంబు చింతింపక,
నన్ను భజియించెనేని ఆతని నెన్నవలె సాధువు గను.

29. అన్యమును చింతింపక ఆతడు నన్ను భజియించుగాన,
పుణ్యాత్ముడై నిజముగా పొందును శాశ్వతంబగు ముక్తిని.

30. ప్రతిన జేసి వచింపుము ఫల్గునా చెడడు నా భక్తుడనుచు,
సత్వరంబుగ పొందును శాంతిని నా భక్తుడైన వాడు.

31. పాపాత్ముడైన గాని ఫల్గునా స్త్రీ శూద్ర వైశ్యులైన,
నన్ను భజియింతురేని పొందెదరు నన్నె  నిక్కంబు గాను.

32. పుణ్యాత్ములను గూర్చియు పూజ్యులగు రాజర్షులను గూర్చియు,
వేఱె చెప్పగ వలయునా వివరించి ఇది యెట్టి మాట చెపుమా.

33. నన్ను నమ్ముము అర్జునా నాయందు భక్తి గల వాడవగుము,
నన్నె పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కంబు గాను.          

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన
గీతామృతమున నవమాధ్యాయము సమాప్తము
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః