10

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున దశమాధ్యాయము

విభూతి యోగము

1. నేను చెప్పెడి దానిని నీయమముగ వినుచున్న కారణమున,
నీ మేలు కోరి యిపుడు చేసెద నే కొంత హితబోధను.

2. బ్రహ్మాది దేవతలకు ఋషులకు ప్రభుడ నే నగుట వలన,
నా యొక్క యుత్పత్తిని  మఱియును నా మహిమ నెఱుగలేరు.

3. అవ్యయుడ లోకేశుడు అజుడను అని నన్ను యెఱుగు వాడు,
సర్వ పాపముల వీడి పొందును శాంతి మయమగు మోక్షమున్.

4. బుద్ధియును జ్ఞానంబును పుడమిలో సత్యంబు శమము దమము,
తపము దాన మహింసయు తత్త్వమును, సుఖ దుఃఖములు క్షమయును.

5. యశము నప యశమ్మును తుష్ఠియు భయమ్ము నభయమ్మును,
కల్గుచుండును ప్రాణికి నా వలన కర్మానుసారముగను.

6. మనువు వలనను గలిగిరి జగతిలో మానవులు పూర్వమందు,
అట్టి మనువుకు నేనెగా మూలంబు ఆదికాలము నందున.

7. సనకాది మునులకెల్ల సప్తర్షి సంఘంబులకు నెల్లను,
నేనె కారణ మర్జునా నిజమిది నీ మదిని నమ్ముమోయి.

8. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి గల్గిన వారికి,
నన్ను జేరెడు జ్ఞానము యిత్తును నాలోన జేర్చుకొందు.

9. నీవు చెప్పినదంతయు నిజమని నమ్మినాడను అచ్యుతా,
నీ మహా వైభవంబు  నీ శక్తి యెఱుగజాలరు యెవ్వరు.

10. ఎందెందు వుందు వీవు యిమ్మహిని యెట్లెట్లు వర్తింతువొ,
ఆ విధము తెలుపుమయ్య అచ్యుతా ఆలకించెద శ్రద్ధతో.

11. ద్వాదశాదిత్యు లందు విష్ణువై వర్ధిల్లుచుందు నేను,
జ్యోతులకు జ్యోతి యగుచు వెలుగొందు సూర్యభగవానుడేను.

12. సర్వ వేదంబులందు సామమును నన్నుగా దెలియుమోయి,
దేవ గణముల యందున నుండెడు దేవేంద్రుడను నేనెగా.

13. ఇంద్రియంబుల లోపల మనసునై యీ దేహమందుందును,
సర్వ భూతము లందును చైతన్య రూపమున నుందు నేను.

14. రుద్రులందున అర్జునా శంకరుండను రుద్రుడను నేనెగా,
యక్ష రాక్షసులందున ఫల్గునా ఆ కుబేరుండ నేను.

15. అష్ట వసువుల లోపల నేనెగా అగ్నినై వెలయుచుందు,
పర్వతంబుల లోపల మేరువను పర్వతంబై యుంటిని.

16. వర పురోహితులందున వాసిగ అల బృహస్పతి నైతిని,
సైన్యాధిపతుల యందు స్కందుడను సైన్యాధిపతిని నేను.

17. సరసులందున వెలయుదు ఫల్గునా వర సాగరంబగుచును,
ఋషుల యందెంచి చూడ భృగువను ఋషిని నేనై యుంటిని.

18. వేదంబులందు నేను వేద్యమగు ఓంకారమై యుంటిని,
సర్వ యజ్ఞములందున యెప్పుడు జపయజ్ఞమై యుంటిని.

19. స్థావరములందు నేను చక్కగా హిమవంతమై యుంటిని,
వృక్షముల యందు చూడ అశ్వత్థ వృక్షమై వెలయుచుందు.

20. దేవర్షులందు నేను దేవర్షి నారదుడనై వెలయుదు,
గంధర్వులందు నేను ఘనముగ చిత్రరధుడై యుంటిని.

21. సిద్ధులందున స్థిరముగా కపిలుడను సిద్ధుండనై యుంటిని,
ఉన్నతాశ్వము లందునా యుంటిని ఉచ్చైశ్వరంబగుచును.

22. అర్జునా! కరులయందు వెలయుదు ఐరావతంబగుచును,
నా దివ్య మహిమ చేత నరులందు రాజునై  వెలయుచుందు.

23. ఆయుధంబుల యందున వజ్రమను ఆయుధంబే నైతిని,
ధేనువులయందు నేను శ్రేష్ఠమౌ కామధేనువు నైతిని.

24. జనన కారకులందున స్మరుడనై వెలయుచుందును నిక్కము,
సర్పంబులందు నేను వాసుకి సర్పంబునై యుంటిని.

25. నాగులందున అరయగ అనంతుడన్ నాగమేనై యుంటిని,
జల దేవతల యందునా వరుణుడను జలదేవతను నేనెగా.

26. పితృ దేవతల యందునా ఆర్యముడను పితృదేవతను నేను,
న్యాయ పరిపాలకులలో దక్షుడౌ యముడ నేనై యుంటిని.

27. రాక్షసుల యందు నేను ప్రహ్లాదుడను పేర పరగుచుందు,
గణిత మొనరించునట్టి వారిలో కాలమును నేనైతిని.

28. మృగములందున జూడగా సింహమను మృగరాజు నేనైతిని,
పక్షులందున జూడగా గరుడుడుండను పక్షి రాజును నేనెగా.

29. పావనము చేయునట్టి వారిలో పవనుండ నేనైతిగా,
శస్త్రధరులందు జూడ శ్రీరామచంద్రుడను నేనైతిని.

30. జల జంతువుల యందునా నక్రమను జల జంతువై యుంటిని,
నదుల యందెన్న నేను శ్రేష్టమౌ జాహ్నవీ నదినైతిని.

31. సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండ నేను,
విద్యలందెన్న గాను అధ్యాత్మ విద్య నేనై యుందును.

32. వాదించు వారియందు సత్యమౌ వాదంబు నేనె సూవె,
అక్షరంబుల యందున " అ" అను అక్షరంబై యుంటిని.

33. సమాసములందు నేను ద్వంద్వమను సమాసమై యెప్పుడు,
అక్షయంబగు కాలమున్ అర్జునా నేనెయై యుంటినోయి.

 34. సర్వతోముఖుడనైన సాక్షియు బ్రహ్మంబు నేనైతిని,
లోకంబు లన్నింటిని పాలించు లోకేశుడను నేనయా.



35. ముందు గల్గెడు వానికి మూలంబు నేనెయై యుంటినోయి,
స్త్రీల యందలి కీర్తియు వాక్కును సిరియు నేనే ఫల్గునా.

36. స్మృతియు మేధయు క్షమయును ధృతియును నేనెగా కనుగొనంగ,
సామముల యందు జూడ బృహత్తను సామంబు నేనైతిని.

37. అఖిల ఛందస్సు లందు గాయత్రి అను ఛందమై యుంటిని,
మాసములలో నెన్నగా మార్గశిర మాసంబు నేనైతిని.

38. ఋతువులందెంచి చూడ వసంత ఋతువునై వెలయుచుందు,
ధరను మోసమ్ములందు జూదమ్ము నేనెయై వెలయుచుందు.

39. తేజంబు గల వారిలో నున్నట్టి తేజంబు నేను నిజము,
బలము గల వారిలోని బలమును నేనెయై వెలయుచుందు.

40. యాదవుల యందు నేను అర్జునా వాసుదేవుడనైతిని,
పాండవుల యందు నేను ఫల్గునా అర్జునుడనై యుంటిని.

41. మునులలో నెన్నగాను ముఖ్యుడౌ వ్యాసభగవాను నేను,
కవులలో యోచింపగా శ్రేష్టుడౌ శుక్రుడను కవిని నేను.

42. శిక్షించు వారిలోన వుండెడు శిక్ష నేనై యుందును,
రాజులందుండునట్టి ఆ రాజనీతియును నేనే జగతి.

43. మఱి రహస్యంబు లందున నుండెడు జ్ఞానంబు నేనె నిజము,
జ్ఞానవంతుల యందున నుండెడు జ్ఞానంబు నేనె నిజము.

44. అంతంబు లేదు చూడ అర్జున నా దివ్య విభూతికి,
సంగ్రహంబుగ జెప్పితి చక్కగా నీవును వింటివోయి.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన
గీతామృతమున దశమాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః