15

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
గీతామృతమున పంచదశాధ్యాయము

పురుషోత్తమ ప్రాప్తి యోగము

1. ఎగువ మూలముండును శాఖలు దిగువగా బర్వియుండు,
శాశ్వతాశ్వత్థ తరువే సంసార వృక్షమని చెప్పబడును.

2. దీని యాకులు వేదముల్ మఱియును దీని కొమ్మలు త్రిగుణముల్,
దీనినెఱిగిన వాడెపో ధీరుడు వేదవిదుడైన వాడు.

3. ఆది మధ్యాంతంబులు అర్జునా! ఎచ్చటను గానరావు,
అట్టి యీ వృక్షంబును నరకవలె అసంగశస్త్రంబున.

4. అట్టి యీ వృక్షమును కనుగొనగ ఆది పురుషుండెవ్వడో,
అతనిని సేవించుచు పొందవలె ఆ బ్రహ్మమును తప్పక.

5. మోహితులు గానివారు మఱియును మోహంబు లేనివారు,
సుఖమును దుఃఖంబును సమముగా జూడగల్గిన వారలు.

6. సర్వకాలములందున సర్వేశు ధ్యానించుచుండు వారు,
పొందరిక జన్మంబుల వారలు పొందెదరు బ్రహ్మంబును.

7. సూర్యచంద్రులు చాలరు చూపగా ఆ బ్రహ్మపదంబును,
పావకుండును జాలడు నిజముగా బ్రహ్మపదమును జూపగా.

8. నన్ను నమ్మిన వారలు మఱియును నన్నె సేవించు వారు,
భ్రాంతి లేనట్టి వారు పొందెదరు బ్రహ్మమును నిక్కముగను.

9. గాలి తా వీచునపుడు గంధంబు గొనిపోవు చందమునను,
దేహమును వీడునపుడు వాసనల దేహి గొనిపోవుచుండు.

10. దేహి పొందుచునుండును సుఖముల దేహముల బొంది తాను,
దేహంబు లేకున్నచో పొందడు దేహి యెప్పుడు సుఖముల.              

11. దేహమును వీడునపుడు మఱియొక దేహమును బొందినపుడు,
యత్న మొనరించి వీని యత్నమును యెరుగుదురు యోగివరులు.

12. ఆత్మ ఙానము లేనిచో యెఱుగరు అఙానులైనవారు,
ఆత్మ ఙానమే ముఖ్యము అర్జునా! ఆ జీవునెఱుగుటకు.

13. సర్వ దేహంబులందు చక్కగా వెలయుచుండుట చేతనే,
జీర్ణమొనరించుచుందు  చిత్రముగ వారు తిను వాని నెల్ల.

14. సర్వదేహములందున వుందును సమముగా నేనెప్పుడు,
ఎరుక మరుపులు స్మృతియును యేర్పడును జీవులకు నా వలననే.

15. వేదముల సృజియించి నే ఫల్గునా! వేద వేద్యుడనైతిని,
సకల వేదముల చేత చక్కగా నన్నెరుంగగ వలయును.

16. అక్షరుడు క్షరుడనుచును అర్జున! పురుషులిర్వురు జగతిలో,
అక్షరుడు ఆ బ్రహ్మము తెలియగా నాక్షరుడు భూతకోట్లు.

17. వీరికంటెను జగతిలో వేరుగా శ్రేష్ఠుడింకొకడు గలడు,
ఆతడే పరమాత్ముడు ఆతడే అవ్యయుం డక్షరుండు.

18. ఆతడే భరియించును భూతముల అంతటను వెలయు కతన,
ఆతడే సృజియించును చివఱకు ఆతడే హరియించును.

19. పురుషులందుత్తముడను నగుటచే పురుషోత్తముడ నైతిని,
నన్ను సేవించువారు నిక్కముగ నన్నె పొందంగ గలరు.

20. పరమ గోప్యంబియ్యది ఫల్గున నీకు నే చెప్పినాడ,
ఇద్దాని నెరుగువాడు యెరుగును సర్వమును సులభముగను.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున పంచదశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః