16

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున షోడశాధ్యాయము

దైవాసుర సంపద్విభాగ యోగము

1. యజ్ఞ దాన తపంబులు మరియును అభయమును ఆర్జవంబు,
దానంబు ధర్మంబును యింకను దమమును అక్రోధము.

2. సత్యంబు సమభావము జ్ఞానమును శాంతియును మార్థవంబు,
దయయు దాక్షిణ్యంబును తలపగా త్యాగమును లజ్జయున్ను.

3. అచాపలం బహింసయు  చింతింప అలోలత్వము పైశునంబు,
తేజంబు ధృతియు క్షమము నేర్పును ధీశక్తి  అద్రోహము.

4. దైవ సంపద యందురు వీనినే దైవజ్ఞులైన వారు,
దైవ సంపద గల్గిన వారలె దైవమును బొందగలరు.

5. దర్పమును పురుషత్వము క్రోధమును  డాంబికము అభిమానము,
అసుర సంపద యందురు అవనిలో వీనినే ధీమంతులు.

6. దైవ సంపద యెప్పుడు తప్పకను మోక్షంబు కల్గించును,
అసుర సంపద యెప్పుడు అర్జున! గల్గించు బంధంబును.

7. అసురు లెరుగరు ఫల్గునా! అవనిలో చేయంగ దగినదేదో,
శౌచమును ఆచారము సత్యమును వారి యందుండవెపుడు.

8. దైవంబు శాస్త్రంబులు లేవంచు దయమాలి పలుకుచుంద్రు,
స్త్రీ పురుషులే జగతికి కారణంబని చెప్పుచుందురెపుడు.

9. ఇట్టి వారలు జగతిలో పుట్టుదురు క్రూరాత్ములగుచు నెపుడు,
ధర్మంబు సత్యంబును దలపక ఘోరకర్మలు జేతురు.

10. కామమే ముఖ్యమనుచు వీరలు కర్మములు జేయుచుంద్రు,
నీచకర్మలు జేయుచు చింతను నిక్కముగ బొందుచుంద్రు.        

11. ఆశచే బద్ధులగుచు వీరలు అన్యంబు చింతింపక,
కోరికలు దీర్చుకొనగ జేతురు ఘోర తపమ్ము నెపుడు.

12. మోహజాల సమావృతుల్ యెరుగరు మోక్షంబు నుర్వియందు,
కామపరులైన వారు మోక్షమును గనలేరు యత్నించియు.

13. చిత్త విభ్రాంతులెపుడు చేరరు మోక్షమును బ్రహ్మంబును,
నన్నెరుంగక వీరలు దుష్టులై నరకమున గూలుచుంద్రు.

14. పొగడుకొని తమ్ము తాము బుధులను నిందించు చుందురెపుడు,
ధర్మమును వీడి వీరు యజ్ఞములు దంభమునకై చేతురు.

15. అన్ని దేహములందున వెలిగెడు ఆ బ్రహ్మమును గానక,
దూరుచుందురు వీరలు అన్యులను దుష్టాత్ములంచు నెపుడు.

16. జన్మ జన్మాంతరముల అసురులై జన్మింతురంతెగాక,
నీచాతి నీచమైన యోనుల నిక్కముగ జన్మింతురు.

17. కామంబు క్రోధంబును లోభమును కనుగొనగ నీమూడును,
నరక ద్వారము అర్జున! ఇయ్యవి నన్ను జేరగ నీయవు.

18. మోక్షమును గోరువారు విడువవలె ముఖ్యముగ నీ మూటిని,
ఈ మూడు లేకున్నచో జీవునికి నిడుములే లేవు జగతి.

19. శాస్త్రోక్త విధిని వీడి కర్మలను సలుపగా రాదు యెవరు,
అట్లు చేసిన వారలు సిద్ధిని అవనిలో బొందలేరు.

20. జ్ఞానమును బొందలేరు మఱియును జన్మముల వీడలేరు,
మోక్షమును బొందలేరు వీరలు కామ మోహితులగుటచే.

21. శాస్త్రములు చెప్పునట్లు కర్మంబు సలుపుచుండుము
అర్జునా! శాస్త్రమే ప్రామాణ్యము జగతిలో కార్యాకార్యములకు.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున షోడశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్
ఓం శాంతి శాంతి శాంతిః