18

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున అష్టాదశాధ్యాయము

మోక్షసన్యాస యోగము

1. త్యాగంబు తత్త్వమెద్దితలపగా సన్న్యాస తత్త్వమెద్ది?
వివరించి చెప్పుమయ్య శ్రీ కృష్ణ వీనులకు విందుగాను.

2. కర్మ ఫలముల గోరక యెప్పుడు కర్మముల జేయువాని,
సన్న్యాసి, త్యాగి యంచు శాస్త్రములు చెప్పుచుండును నిజమిది.

3. మొదట విషముగ దోచుచు తుదకది యమృతమ్ముగ నుండిన,
ఆ సుఖము సాత్వికంబు అని నీవు నిక్కముగ నెఱుగవలయు.

4. అమృతంబుగ నుండియు తుదకది విషముగా మారెనేని,
అట్టి సుఖమును నెప్పుడు అర్జున రాజసంబని యెఱుగుము.

5. ఆద్యంతముల యందున అర్జున! విషతుల్యముగ నుండిన,
ఆ సుఖము తామసంబు అని నీవు నిక్కముగ దెలియ వలయు.

6. బ్రాహ్మణుల క్షత్రియులను ఫల్గున వైశ్యులను శూద్రాదుల,
కల్పించినాను నేను కర్మలను బట్టి యీ జగతి లోన.

7. శమము దమమును దపమును శౌచమును ఙాన విఙానములును,
సత్యమును ఆస్తిక్యము సహజముల్ బ్రహ్మణుల కెల్లప్పుడు.

8. శౌర్యంబును ధైర్యంబును గీర్తియు సాహసంబును దానము,
జనుల నేలుట యనునవి క్షత్రియుల సహజ ధర్మము లర్జున.                      

9. వర్తకము గోపోషణ కృషియును వైశ్యులకు ధర్మంబులు,
శుశ్రూషయే ముఖ్యమై యొప్పును శూద్రులకు జగతి నెపుడు.

10. ఎవరి కర్మలు వారలు తప్పకను యెప్పుడును జేయుచున్న,
అట్టి వారికి గల్గును అర్జున!  ఙానంబు జగతి యందు.

11. తక్కువని తన ధర్మమున్ విడుచుట ధర్మంబు గాదు పార్ధ,
తన ధర్మ మెట్టిదైన జేయుటే ధర్మంబు ధరణి లోన.

12. దోషములు గలవంచును కర్మలను దూషింప రాదు యెపుడు,
సహజ కర్మల నెప్పుడు విడువక సాగింపవలె జగతిలో.

13. నిప్పునెప్పుడు ధూమము తప్పక గప్పి యుండెడు రీతిగ,
కర్మలను గూడియుండు దోషములు కనుగొనగ సహజంబుగ.

14. అందుచే కర్మములను అర్జున! చేయవలె ఫలము వీడి,
ఫలము గోరక చేసిన పనులను చిత్కంబు శుద్ధమగును.

15. చిత్తంబు శుద్ధమైన తదుపరి చింతింపవలె బ్రహ్మమున్,
ఆ ఙాన మార్గంబును అర్జునా! సంగ్రహంబుగ దెల్పెద.

16. నిర్మలంబగు మనసుతో నెప్పుడు నిశ్చయంబగు బుద్ధితో,
శబ్దాది విషయములను చక్కగా నిగ్రహింపగ వలయును.

17. కాయవాఙ్మాన సక్రియల్ అను వాని కట్టిపెట్టగ వలయును,
మితముగా భుజియించుచు నుండవలె సతతమేకాంతమందు.

18. వదలకుండగ ధ్యానమున్ చేయవలె వైరాగ్య భావంబుతో,
కామంబు క్రోధంబును మఱియును గర్వమును వీడవలయు.

19. శాంతమును బూని యెపుడు శ్ద్ధతో ధ్యానమును జేయవలయు,
నేను నాదను భావమున్ వీడవలె నిక్కముగ ఙాని యెపుడు.

20. నిర్మలుండైన యోగి కర్మలను నిశ్చింతగా జేయును,
కోరడెన్నడు దేనిని కూర్మి తో దూషింపడెద్దానిని.

21. సమముగా జూచుచుండి ప్రేమతో సర్వ భూతముల నెపుడు,
నన్ను సేవించుచుండి పొందును నన్నె నిక్కంబు గాను.

22. ఇట్లు చింతించువాడు యెఱుగును నా తత్త్వమును సర్వమున్,
నా తత్త్వమెరుగు వాడు నాలోన లీనమై యుండునెపుడు.

23.  కాన నీవును అర్జునా కర్మలను నా యందు సన్యసించి,
నీ మదిని నిల్పుమోయి నా యందు నిశ్చలంబగు భక్తితో.

24. నిశ్చలంబగు భక్తితో నీ మదిని నా యందు నిల్పితేని,
నా ప్రసాదంబు వలన దాటెదవు నా మాయ నతి సులువుగా.

25. అట్లు కాదందువేని అర్జునా! అన్ని విధముల చేతను,
నష్టమై నశియింతువు పొందవు నన్ను నిక్కంబు గాను.

26. అన్ని భూతములందున నీశ్వరుడు అవ్యక్తముగ నుండి తా,
త్రిప్పుచుండును వానిని తప్పక తన మహామాయ వలన.

27. అన్ని విధముల చేతను నీ వతని శరణు బొందుము ఫల్గున!
శాంతి గల్గును బూర్తిగ లభియించు శాశ్వతంబగు మోక్షము.

28. అత్యంత గోప్యమైన ఙానమును అర్జునా! తెల్పినాడ,
యోచించి చక్కగాను కర్మలను తోచినట్లుగ జేయుము.

29. నాకు ప్రియుడవు కావున నీకు నే నింకొకటి చెప్పుచుంటి,
అత్యంత గోప్యమిద్ది అర్జునా! వినుము నీ చిత్తమిచ్చి.

30. నా యందె మనసు నుంచి భక్తితో నన్నె సేవింపుమోయి,
నాకె మ్రొక్కుము ఫల్గున! సర్వమును నాకు యర్పింపుమోయి.

31. పొందెదవు నన్ను నీవు నిక్కముగ పొందవిక జన్మములను,
ప్రతిన జేసి యదార్ధమున్ ఫల్గున! పల్కుచుంటిని నమ్ముము.

32. సర్వ ధర్మముల వీడి సత్వరమే శరణు పొందుము నీవిక,
సర్వ పాప విముక్తుగా సల్పుదు దుఃఖ పడకుము ఫల్గున!        

33. తపము చేయని వానికి నాదైన తత్త్వమెఱుగని వానికి,
శుశ్రూష జేయనట్టి శూద్రులకు చెప్పకీ ధర్మంబును.

34. నన్ను నమ్మని వానికి ఫల్గున నన్ను దూరెడు వానికి,
చెప్పకీ ధర్మములను యెప్పుడు చెప్పినచో చెడిపోదురు.

35. అత్యంత గోప్యమైన దీనిని అత్యధిక భక్తి తోడ,
నా భక్తులకు జెప్పిన వాడిలలో నన్నె బొందును తప్పక.

36. అత్యంత ప్రియుడు నాకు అర్జున గీత బోధించువాడు,
మనుజులలో వానికంటే ప్రియతముడు మహిలోన లేడు నాకు.

37. ఈ గీతా శాస్త్రంబును నెవరైన భక్తితో బఠియించిన,
నన్ను  సేవించి రంచు నమ్ముము ఙాన యఙంబు చేత.

38. అత్యంత శ్రద్ధ తోడ దీనిని ఆలకించెడు వాడును,
సర్వ పాపముల వీడి పొందును సత్పథంబును నిజముగ.

39. అర్జునా! విని యుంటివి దీనిని అఙానమది తొలగెనా?
వీనులారగ విందునే సత్యమును వినిపింపు మొక్కతూరి.

40. తొలగి పోయెను మోహము శ్రీకృష్ణ తోచెను సుఙానము,
నీవు జెర్పిన రీతిగ జేసెదను నిక్కముగ కర్మములను.

41. శ్రీకరంబగు దీనిని నెరిగించె శ్రీకృష్ణుడర్జునునకు,
వీనులారగ వింటినే ధృతరాష్ట్ర విని పొంగి పోవుచుంటి.

42. విజయుడును శ్రీకృష్ణుడు వెలసిన తావులందున నెప్పుడు,
నీతియును నైశ్వర్యము లక్ష్మియు నిక్కముగ నుండు జయము.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున అష్టాదశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః