7

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున సప్తమాధ్యాయము
          
విజ్ఞానయోగము

1. నాయందు మనసునుంచి అర్జునా నన్ను పొందెడు విధమును,
తెలిపెదను బ్రీతి తోడ విశదముగ తెలియు మద్దాని నీవు.

2. ఇద్దాని తెలుసుకొన్న యిక నీవు తెలియవలసిన దుండదు,
సాంతముగ ఆ జ్ఞానమున్ తెలిపెదను స్వాంతంబు నిల్పి వినుము.

3. వేయింటి కొక్కడుండు జ్ఞానమును వివరించి తెలియువాడు,
అట్టి వారిలో నొక్కడే అర్జునా నన్నెఱుంగును నిజముగ.

4. అష్ట విధముల నొప్పుచు అర్జునా యుండు నా ప్రకృతి యెపుడు,
ఇంతకన్నను గొప్పది తెలియగా నింకొక్కటున్నదోయి.

5.పుట్టింప గిట్టింపను పుడమిలో నివి రెండె కారణములు,
వీని వలననె గల్గును జీవులకు వివరింప ద్వంద్వములును.

6. శ్రేష్టమైనది జగతిలో నా కంటె జింతింప మఱిలేదుగా,
దారమున మణులట్టుల నా వలన ధరియింపబడు జీవులు.

7. సూర్యచంద్రుల యందలి తేజంబు శోధించి చూడ నేనె,
వేదమందలి ప్రణవమున్ నేనెగా బేధమించుక లేకను.



8. అగ్ని యందలి తేజమున్ నేనని అర్జునా యెఱుంగుమెపుడు,
జీవులందలి జీవమున్ చింతింప నేనెయై యుందు నెపుడు.

9. సకల భూతములందునా బీజమై సంచరింతును నెప్పుడు,
కామ రాగములు లేని బలమును కనుగొనగ నేనె నిజము.

10. ధర్మమును వీడనట్టి కామమును ధరణిలో నేనె నిజము,
ఈ విధంబుగ సర్వమున్ వ్యాపించి యేలుచుందును జగముల.

11. త్రిగుణములు నా వల్లనే గల్గును తివిరి చూడగ జగతిలో,
వాని యందున లేను  నే నాయందు వసియింప వవియు నిజము. 

12.  ఈ గుణంబుల చేతను ఈ జగము మోహితంబైన కతన,
పకృతికి నంటకుండ బరగెడు నన్నెఱుంగగ జాలదు.

13. త్రిగుణముల చేత నిద్ది నా యందు తేజరిల్లుచు నుండును,
ఇయ్యదే దైవ మాయ యిద్దాని దాటుటతి కష్టమోయి.

14. భక్తితో నన్ను నెపుడు భజియించు భక్తులే దాటగలరు,
దాట శక్యము గాదుగా నన్యులకు నా దైవ మాయ యెపుడు.

15. ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అర్థకాములు నల్గురు,
నన్ను గొల్వగ వత్తురు అర్జునా  నాకృపను బొందుటకును.

16. నిశ్చలంబగు భక్తిచే యేగియై నెగడుచుండెడు భక్తుడు,
అత్యంత ప్రియుడు నాకు ఆ జ్ఞాని అతనికిని నేను ప్రియుడ.
17. సర్వమును నేనంచును భావించు, సర్వజ్ఞుడైన కతన,
భిన్నులము గాము మేము యిర్వురము భేదంబు లోయేదు గాన.

18. బహు జన్మముల నెత్తి తా భక్తుండు భవబంధముల వీడి,
నేనె సర్వంబంచును మదినెంచి నిక్కముగ నన్నెపొందు.

19. ఇట్టి జ్ఞానము లేమిచే నెరుగరు పామరులు నన్ను పార్థ,
అందుచే గొల్చుచుండ్రు వారలు అన్య దేవతల నెపుడు.

20. అట్టి వారలు బొందెడు ఫలములు అల్పంబులై యుండును,
నన్ను భజియించువారు బొందెదరు నన్నె నిక్కంబుగాను.

21. అవ్యయుడనైన నన్ను నెఱుగక అజ్ఞానులైన వారు,
పుట్టుచును గిట్టుచుంద్రు  యెప్పుడు పుడమిలో నిక్కముగను.

22. పుణ్య కర్మముల చేత పాపములు బూర్తిగా బాపుకొన్న,
వారలే నన్ను గొల్త్రు నిష్ఠతో వదలకుండగ నెప్పుడు.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున సప్తమాధ్యాయము సమాప్తము.

ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః