8

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున అష్ఠమాధ్యాయము

అక్షర పరబ్రహ్మ యోగము

1. బ్రహ్మమన నెట్టిదయ్యా పరికింప అధ్యాత్మ మది యెట్టిది?
అధిభూతమది యెట్టిది అచ్యుతా కర్మమననెద్ది చెపుమా.

2. అధి దైవ మనగ నేమి? దేహమం దధియజ్ఞు డెవ్వడయ్య,
అంత్యకాలమున బుధులు అచ్యుతా నిన్నెట్టు కనుగొందురు.

3. అక్షరుడు అవినాశియు అయిన వాడా పరబ్రహ్మమూర్తి,
ఆత్మ తత్త్వమదెన్నగా అర్జునా అధ్యాత్మమై యొప్పును.

4. ప్రాణులకు మేలు జేయు కర్మమది భావింప యజ్ఞమగును,
పుట్టి గిట్టెడు వానిని భువిలోన అధిభూతమని బిల్తురు.

5. అక్షరుండైన వాని పిల్తురు అధిదైవతంబంచును,
అధియజ్ఞుడనగ నేనే అర్జునా ఈ దేహమందుందును.

6. అంత్యకాలము నందు నన్నెవడు ఆత్మ దలచుచు నుండునో,
అతడు తప్పక పొందును అక్షరంబైనట్టి నా పదంబు.

7. ఎవ్వడే భావంబును దలచుచు ఈ దేహమును వీడునో,
ఆ భావమును దలచుచు  తప్పక అతడు జన్మించు మరల.

8. ఉల్లమును బుద్ధినెపుడు నా యందు నుంచి చింతించుచున్న,
పొందెదవు నన్ను నీవు అర్జునా సందియంబిందు లేదు.

9. అభ్యాస యోగంబు చే ఫల్గునా అతని పొందగ వచ్చును,
ఆత్మ శుద్ధియె ముఖ్యము చింతింప నా పరబ్రహ్మంబును.

10. సర్వ కాలము లందునా బ్రహ్మమును స్మరియించువాడు తుదిన,
పొందు నా బ్రహ్మంబును నిక్కముగ పొందడిక జన్మంబుల. 

11. అంత్యకాలము నందున యోగులు ఆ యోగ బలము చేత,
అట్టిట్టు బోనీయక చిత్తమును ఆ బ్రహ్మమున జేర్తురు.

12. అక్షరంబని దేనిని బిల్తురు ఆ బ్రహ్మవేత్త లెపుడు,
రాగంబు లేని యతులు దేని ననురాగమున గాంక్షింతురో.

13. అట్టి బ్రహ్మ పదంబును అర్జునా యెఱిగింతు బ్రీతితోడ,
అద్దాని బొందుమోయి అయ్యదే శాశ్వతంబగు బ్రహ్మము.

14. అంత్యకాలము నందున ఆర్తితో ఓంకారమును దలచుచు,
దేహమును వీడువాడు పొందును దేవదేవుని బ్రహ్మమున్.

15. అన్యమును చింతింపక యెవ్వడు ఆ బ్రహ్మమును గొల్చునో,
అట్టి వారికి చిక్కును సులభముగ ఆ బ్రహ్మ మర్మమెప్పుడు.

16. ఏ లోకమున కేగిన తప్పక ఈ లోకమున బుట్టును,
ఆ బ్రహ్మమును బొందిన జీవుడు అవనిపై జన్మింపడు.

17. జ్ఞాన మార్గం బొక్కటి అజ్ఞాన మార్గ మింకొక్కటోయి,
జ్ఞానులైనట్టి వారు  బొందుదురు శాశ్వతంబగు ముక్తిని.

18. అజ్ఞానులకు చిక్కదు అయ్యది జ్ఞానమయ మగుట చేత,
అందుచే జ్ఞానులెపుడు అందగా జూతురా బ్రహ్మపదము.

19. కర్మ జేయగ వలయును యోగి తా కర్మ ఫలముల గోరక,
కర్మమే గద జగతిలో జన్మకు కారణంబై యుండును.

20. కర్మ ఫలముల గోరక యెప్పుడు కర్మముల జేయు యోగి,
యజ్ఞ యాగముల చేత చిక్కని ఆ బ్రహ్మమును బొందును.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున అష్ఠమాధ్యాయము సమాప్తము.

ఓం తత్ సత్‌

ఓం శాంతి శాంతి శాంతిః