2

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున ద్వితీయాధ్యాయము

సాంఖ్యయోగము

1. ఈరీతి వగచుచున్న పార్ధుని యీప్సితంబును దీర్పగ
బోధించె శ్రీకృష్ణుడు తత్త్వమును బుద్ధిమారెడు రీతిగా                     

2. తాత దండ్రులు మిత్రులు యుద్ధమున తప్పకను చత్తురనుచు
బాధ పొందెద వేలయ భావమున తత్త్వమును తెలియలేక

3. దేహ మెప్పుడు నిల్వదు చావడు దేహి నిక్కంబుగాను
దేహి విడుచుచు నుండును దేహముల జీర్ణవస్త్రములరీతి   

4. వచ్చి పోవుచు నుందురు జీవులు వాంఛలను దీర్చుకొనగ
తత్త్వవిదులైన వారు దుఃఖమును పొందరీ తత్త్వమెఱిగి

5. బాల్యమును యవ్వనంబు జరయును వచ్చుచుండెడి రీతిగా
వచ్చుచుండును దేహముల్‌ దేహికి వాంఛ దీరకయున్నచో

6. వాంఛచేతనే దేహముల్‌, దేహికి వచ్చుచుండును యెప్పుడు
వాంఛలే లేకున్నచో దేహముల్‌ వచ్చు టెట్టులో చెప్పుమా

7. మాఱుచుండును దేహముల్‌, ధరణిలో మాఱడెన్నడు జీవుడు
అజ్ఞానవశముచేత యెఱుగ రీ సత్యమును అజ్ఞులిలను

8. ఆత్మచావదు చంపదు అయ్యాత్మ అంటకుండును సర్వమున్‌
అంతటను వెలుగొందును నిక్కముగ అవ్యయంబగుట వలన

9. శస్త్రముల చేతగాదు చంపగా అస్త్రముల చేతగాదు
అగ్ని కాల్పగజాలదు అద్దాని జలము తడుపగ జాలదు

10. ఇంద్రియంబులు యెఱుగవు అద్దాని ఇంద్రుడును యెఱుగలేడు
మనసు ఊహించలేదు అయ్యాత్మ మర్మమెఱుగగ జాలదు

11. ఆత్మ ఇట్టిదటంచును ధ్యానమున అనుభవింపగ వలయును
ఆత్మతత్త్వంబు నెఱిగి యిక నీవు అని సేయవలయునయ్య

12. ఆది అంతములు లేవు జీవునకు అవ్యయుండగుటవలన
వచ్చుచును పోవుచుండు జగతికి వాంఛలచె బద్ధుడగుచు

13. ఆత్మ నిక్కముగాదని అన్నచో అది యెట్లు పొసగునయ్య
గిట్టుచుండెడు ప్రాణులు జగతిలో పుట్టు నిక్కంబుగాను

14. వచ్చిపోయెడు వారికి అర్జున, వగచుటది న్యాయమౌనే
సర్వదుఃఖములు వీడి ధైర్యముతో సమరంబు సలుపుమయ్య

15. సుఖ దుఃఖములు యెప్పుడు సమముగా జూచుచుండుము అర్జున
అట్టి భావంబుతోడ సమరమును ఆచరింపగ వలయును

16. అట్టి భావంబుతోడ కర్మముల నాచరించెడు వారలు
పుణ్యపాపముల వీడి పొందెదరు పరమపదమును నిజముగా

17. సుఖ దుఃఖములు యెప్పుడు సమముగా జూచుచుండుటె యోగమౌ
అట్టి యోగంబు పూని కర్మల ఆచరింపగ వలయును

18. సుఖ దుఃఖములు రెండును కర్మకు ఫలములై చూపట్టును
అట్టి ఫలముల గోరక బుధులెపుడు ఆచరింతురు కర్మమున్‌

19. కర్మ ఫలముల గోరిన జీవునకు కష్టములు తప్పవెపుడు
కర్మమేగద జన్మకు జగతిలో కారణంబై యుండును

20. కర్మఫలముల వీడిన జీవులకు కాలుష్య మంటదెపుడు
కలుషరహితుడు గాంచును నిక్కమౌ వైరాగ్య భాగ్య మహిమ

21. ప్రజ్ఞ స్థిరమైనవాడు యెట్టుల పల్కుచుండునో చెప్పుమా
యెటెల కూర్చుండు నతడు యెటులుండు యేమేమి చేయుచుండు

22. మనసు నందలి కోరికల్‌ సర్వమును మటు మాయముగ చేయును
ఆత్మయగు బ్రహ్మమందులీనుడై ఆనంద మొందుచుండు

23. సుఖ దుఃఖముల నొకటిగా జూచుచు కర్మలను జేయుచుండు
వీడి యుండును రాగమున్‌ ద్వేషమున్ వీడియుండును భయమును

24. విషయ సుఖముల నొల్లక యెప్పుడు విషమువలె భావించుచు
కూర్మంబు నడుపునట్లు కూర్మితో తన ఇంద్రియముల నడుపు

25. విషయ చింతన చేయగా జీవునకు వెంటనే సంగమబ్బు
సంగంబుచే గల్గును కామంబు సర్వజనులకు నుర్విలో

26. కామంబుచే గల్గును క్రోధంబు గడవగా తరముగాదు
దాని వలననె గల్గును మోహంబు తధ్యమిది జగతి యందు

27. మోహమది బుద్ధి చెఱచి మోక్షంబు జీవునకు దొరకనీక
బహుకష్టములు యెప్పుడు బెట్టుచు భ్రష్టునిగ జేయుతుదకు

28. శాంతి గోరెడు జీవుడు విషయముల స్వాంతమున జేరనీడు
స్వాంతమున జేరినేని విషయములు శాంతినే పారద్రోలు

29. కామ క్రోధముల వీడి జీవుడు సంగంబు కడకుద్రోయ
పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతంబగు ముక్తిని


ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున ద్వితీయాధ్యాయము సమాప్తము

ఓం తత్సత్‌ ఓం