17

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున సప్తదశాధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము

1. శాస్త్రోక్త విధిని వీడి కర్మముల శ్రద్ధతో జేయుచున్న,
ఆ కర్మలకు ఫలంబు యెట్టిదో అచుతా తెలుపుమయ్య.

2. పూర్వ కర్మ వశంబున జీవులకు పుట్టుచుండు గుణంబులు,
గుణములను బట్టి గల్గు శ్రద్ధయు గురుతుగా వీరలకును.

3.సాత్వికులు గొల్చుచుంద్రు శ్రద్ధతో దేవతల నుర్వియందు,
రాజసులు గొల్చుచుంద్రు రాక్షసుల యక్షులను బ్రీతితోడ.

4. తామసులు గొల్చుచుంద్రు తప్పక బ్రీతికో బ్రేతంబుల,
యీ విధంబుగ గొల్తురు దేవతల నీ మూడు తెగల వారు.

5. దంభ బల యుక్తులగుచు తపమును సల్పుచుందురు తామసుల్,
ఆ తపముచే గల్గును అర్జున అన్యులకు తమకు గీడు.

6. ఆయువును బెంచువాని మఱియును నారోగ్యమైనవాని,
ఘృత పక్వమైన వాని మరియును రసవంతమైన వాని.

7. సాత్వికులు గోరుచుంద్రు అర్జునా సత్వంబు నిచ్చు కతన,
అన్యమును గోరరెపుడు వారలు అయుక్తమగుట వలన.

8. చేదుగను పుల్లగాను ఉప్పగా చింతింప కారముగను,
వుష్ణముగ నుండు వాని నుర్విలో గోరుచుందురు రాజసుల్.

9. చల్లనైనట్టి వాని మఱియును చప్పనైనట్టి వాని,
చెప్పరానట్టి వాని  యింకను చెడు కంపు గొట్టు వాని.

10. తినగ మిగిలిన వానిని యింకను తినగ రానట్టి వాని,
తెలివి మాలిన వారలై తామసులు తినుచుందు రుర్వియందు.

11. కర్మ ఫలముల గోరక కర్మముల జేయుచుందురు సాత్వికుల్,
శాస్త్రములు దెల్పునట్టి యజ్ఞముల శ్రద్ధతో జేయుచుంద్రు.

12. కర్మ ఫలముల గోరుచు కర్మముల జేయుచుందురు రాజసుల్,
ప్రబలమైనట్టి కీర్తి జగతిలో పడయుటకు జేయుచుంద్రు.

13. శాస్త్రములు చెప్పునట్టి కర్మలను శ్రద్ధ యించుక లేకను,
మంత్రములు లేకుండను మఱియును దక్షిణలె లేకుండగా.

14. అన్నదానంబు నందు యించుకయు నాసక్తి లేకుండగ,
యజ్ఞములు జేయుచుంద్రు అర్జున తామసుల తత్త్వమిద్ది.

15. దేవతల ద్విజుల గురుల ప్రాఙులను దీక్షతో బూజించుట,
శౌచంబు గల్గియుంట చక్కగ నార్జవము వీడియుంట.

16. బ్రహ్మచర్య మహింసల నిష్ఠగ పాటించుటను నియ్యవి,
శారీరకంబగు తపంబని శ్రద్ధతో యెఱుగవలయును ఫల్గున.

17. పరుల నొప్పింప నదియు నింకను బరహితంబై నట్టిది,
సత్యమును బ్రియమైనది యగు వాక్కు చక్కగ పలుక వలయు.

18. అధ్యయన మెల్లప్పుడు అర్జున చేయుచుండుట యనునది,
వాక్తపంబటంచును పెద్దలు వ్రాక్రుచ్చు చుందురెపుడు.

19. శాంతమును సతతంబును స్వాంతమును గల్గియుండగ వలయును,
మౌనంబు గల్గియుంట విషయములు మఱి చింత చేయకుంట.

20. చెడు తలంపులు మనసులో నెప్పుడు చేరనీయక యుండుట,
మానసాత్మక తపమని పల్కుదురు మహనీయులైన వారు.

21. దేశంబును కాలంబును మఱియును తెలిసి పాత్రత నెప్పుడు,
సాత్వికులు చేయునట్టి దానమును సాత్వికంబని యెఱుగుము.

22. మనసు నందిచ్ఛ లేక మఱియును ప్రతిఫలము గాంక్షించుచు,
రాజసులు జేయునట్టి దానమును రాజసంబని యెఱుగుము.

23. శాస్త్రోక్త విధిని వీడి స్వాంతమున భక్తి శ్రద్ధలు లేకను,
తామసులు చేయునట్టి దానమును తామసిక దానమంద్రు.

24. పనులు జేతురు ప్రాఙులు ప్రణవమును పల్కుచును మొట్టమొదట,
కర్మలీరీతి జేసి ప్రేమతో కనుగొందు రా బ్రహ్మమున్.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున సప్తదశాధ్యాయము సమాప్తము.
ఓం  తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః.