3

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున తృతీయాధ్యాయము

కర్మయోగము

1. కర్మమును జ్ఞానమనెడు మార్గములు కనుగొనగ జగతి కలవు,
గొప్పదేదియొ రెంటిలో తెలుపుము గోవింద కృష్ణ కృష్ణ.

2. యోగులకు కర్మపధము జ్ఞానులకు సాంఖ్యంబు యోగ్యమగును,
కర్మమే కారణంబు జగతిలో జ్ఞానంబు కల్గుటకును.

3. కర్మ ఫలమును గోరక జీవుడు కర్మముల జేయవలయు,
ఈ రీతి కర్మ జేయగల్గును యీప్సితంబగు జ్ఞానము.

4. అజ్ఞానులగు వారికి కర్మయే అతి ముఖ్యమై యుండును,
ఆ కర్మ లేకున్నచో తొలగదు అజ్ఞానమది నిక్కము.

5. కర్మ చేయక యున్నచో తొలగవు కష్టములు ప్రాణులకును,
బ్రహ్మ సృజియించె మున్ను యజ్ఞముల బాగుగా జేయుడనుచు.

6. యజ్ఞములు చేయుచున్న దేవతలు అత్యంత తృప్తులగుచు,
వరములిత్తురు ప్రేమతో వారలా వాంఛితంబులు దీరగ.

7. ఆత్మయగు బ్రహ్మమందు లీనుడై ఆనందమొందునరుడు,
చేయనక్కర  లేదయా కర్మముల్ చేసియును ఫలము లేదు.

8. కర్మ ఫలమును గోరక చేసినా కర్మంబె ముక్తి నొసగు,
కర్మ చేయుము అర్జునా ఫలకాంక్ష వీడి మోక్షము నందగా.

9. అజ్ఞాని ఫలముగోరి కర్మముల నాచరించుచు నుండగా,
ఫలము గోరక యెప్పుడు పనులను చేయునా బ్రహ్మ విదుడు.

10. పెద్దలెట్టుల సేతురో కర్మంబు పిన్నలట్టులె చేతురు,
కాన ఫలమును గోరక బుధులెపుడు కర్మముల జేయవలయు.

11. శుద్ధాత్ములైన వారు శ్రద్ధతో యిద్దాని నాచరింప,
కర్మ బంధంబు తొలగు కలుగును మోక్షంబు నిశ్చయముగా.

12. అశ్రద్ధతో కూడియు ఇద్దాని నాచరింపని వారలు,
నష్టమతులగుచు తుదకు నరకమును పొందుదురు నిక్కముగను.

13. ఇచ్ఛ వచ్చిన రీతిగా ప్రకృతి యిద్ధాత్రి వర్తింపగా,
అట్టి ప్రకృతిని మనము  యే రీతి అడ్డగింపంగ గలము.

14. అని పలుకుటది న్యాయమా అర్జున అటుల పలుకగ రాదయా,
రాగమును ద్వేషమనెడు యివి రెండు రజోగుణోద్భవములు.

15. వశము గారాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును,
జ్ఞానమును ఆవరించి కామమజ్ఞానమును కలుగజేయు.

16. కామమే శత్రువగుచు జీవునకు కల్గించు నరకములను,
కావుననే జ్ఞానులెపుడు కామమును కడకు ద్రోయగ వలయును.

17. కామమున కాశ్రయములు కనుగొనగ మనసు బుద్ధీంద్రియములు 
కామమది వీనిగప్పి కల్గించు నేహంబు జీవులకును.

18. కర్మేంద్రియముల కన్న కనుగొనగ జ్ఞానేంద్రియములు మేలు,
వాని కంటెను మనసును బుద్ధియు శ్రేష్టమై వఱలుచుండు.

19. అట్టి బుద్ధికి పైనను వర్తించు ఆ జ్ఞానమే శ్రేష్టము,
అద్దాని బిలుతురెపుడు  ఆత్మ యని  సుజ్ఞానులైన వారు.

20. అయ్యదే బ్రహ్మమంచు అర్జునా నిక్కముగ నమ్మి మదిని,
అట్టి జ్ఞానమును బొంది కామమును అణచి జయమును బొందుము.

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన
గీతామృతమున తృతీయాధ్యాయము సమాప్తము
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః