1

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
గీతామృతమున ప్రథమాధ్యాయము

అర్జున విషాదయోగము

1. శ్రీ కృష్ణ భగవానుడు శీఘ్రముగ శ్రీకరంబగు గీతను
ధర్మమును స్థాపింపగా బోధించె ధరణిపై అర్జునునకు

2. దుష్టుడగు ధృతరాష్ట్రుడు దుఃఖముతో అడిగె సంజయు నప్పుడు
పాండవులు తనవారలు యుద్ధమున పాల్గొనిన విధము దెలియ

3. సమరంబు చేయనున్న సైన్యమును చక్కగా జూచియపుడు
చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యునితో నిట్టుల

4. పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నె దృపదాత్మజుండు
భీమార్జునుల బోలిన శతృభీకరులు సాత్యకి ముఖ్యులు

5. కుంతి భోజుడు, శైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయటకును
వచ్చినిలిచిరి రణమున వారలు యుద్ధ మనివార్యమనుచు

6. ఇంక మన వారి వినుము, జంకేల యెఱిగింతు వీరవరుల
నీవు భీష్ముడు కర్ణుడు నీ సుతుడు సౌమదత్తి వికర్ణుడు

7. ఇంక నెందరో వీరులు యీరీతి చేరి యుండిరి యిచ్చట
ప్రాణముల సరుకు గొనక వీరలు బవరండు సేతురయ్య

8. ఆనందమును గూర్పగ, భీష్ముడు అప్పుడూదెను శంఖము
అంతటను కురువీరులు శంఖముల నందందపూరించిరి

9. శ్రీ కృష్ణుడర్జునుండు శంఖముల శీఘ్రముగ పూరింపగ
ఆ శబ్ద సరణి యపుడు కౌరవుల గుండెలదరగ జేసెను

10. అంతటను పాండుసుతులు శంఖముల నాశ్చర్యముగ నూదిరి
ఈరీతి శంఖధ్వనుల్‌ వినిపించె ఇరుపక్షముల నుండియు

11. ఉభయ సైన్యముల మధ్య తన రథము నుంచమని పల్కగానే
అటుల జేసెను కృష్ణుడు అందరిని గాంచగల్గెడు రీతిగా

12. కురుపాండవుల గాంచుచు కూర్మితో పలికె ఫల్గునుడప్పుడు
తాత తండ్రులు గురువులు తనయులు తఱచి చూడగ మిత్రులు

13. ఇట్టి వారిని చంపగా మన కెట్టి జయము గల్గునో చెప్పుమా
తాత తండ్రుల జంపి నా పాపంబు తప్పకను చేకూరదే

14. శుభసూచకములు నాకు చూడగా గోచరించుట లేదయ
వణకుచున్నది దేహము, యుద్ధము వలదనుచు దెలుపగాను

15. మనసు నిలవదు దైవమా నేనేమి మాటలాడగ జాలను
వలదు రాజ్యము గీజ్యము వలదయ్య సౌఖ్యంబు వలదు వలదు

16. స్వజనులందఱు సమసిన, రణమున సౌఖ్యంబు గలదె చెపుమా
కాన వీరల జంపను నాకింక కాంక్షయే లేదు లేదు

17. ఇటుల జంపిన వీరల వంశంబదెటు సంకరంబు గాదు
వర్ణసంకరమైనచో పితరులకు నరకవాసము తప్పదు

18. వారి జంపుట కన్నను వారిచే నే జచ్చుటెంతో మేలు
అనుచు ఈరీతిగాను కూలబడె అస్త్ర, శస్త్రముల విడచి

ఓం
ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన
గీతామృతమున
ప్రథమాధ్యాయము సమాప్తము

ఓం తత్సత్‌ ఓం