12

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
గీతామృతమున ద్వాదశాధ్యాయము
        
భక్తి యోగము

1. కర్మయోగులు ముఖ్యులా? కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యులా?
వీరిలో యెవరు గొప్ప వివరించి తెలియ చెప్పుము అచ్యుతా?

2. నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజియించువారు,
సర్వమ్ము నేనెయంచు మదినెంచి సంచరించెడు వారును.

3. నాకు ముఖ్యులు వీరలు ఫల్గునా నన్నాశ్రయించు కతన,
వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో.

4. అవ్యయుని అగ్రాహ్యుని మఱియును అప్రమేయుని గాంచగా,
యత్నించు వారు గూడ అర్జునా నన్నె పొందంగగలరు.

5. ఆ మార్గమతికష్టము అర్జునా అందరికి సాధ్యపడదు,
కష్టములు పడక పార్ధ చిక్కునే కమలేశు పాదభక్తి.

6. నన్నెగతిగా నెంచుచు నాకన్ని కర్మఫలములు నిచ్చుచు,
నా యందె మనసు నుంచి యెప్పుడు నన్ను సేవించువారి .

7. జన్మ బంధంబు నుండి రక్షింతు సత్వరంబుగ వారిని,
సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబు నిత్తు నేను.

8. నా యందు మనసు నుంచి తిరముగా నన్ను భజియింతువేని,
నా యందు వసియింతువు నమ్ముము సందియంబిందు లేదు.

9. నాయందు మనసు నుంచి ఫల్గునా నన్ను జేరగ లేనిచో,
అభ్యాస యోగంబు చే అర్జునా నన్ను బొందగ వచ్చును.

10. దానికిని జాలవేని ననుగూర్చి ధర్మ కార్యముల నెపుడు,
గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగ. 

11. అటుల చేయగ లేనిచో అర్జునా నన్నాశ్రయించి నీవు,
సర్వ కర్మల జేయుచు చక్కగా ఫలము నాకర్పింపుము.

12. అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్ని విధముల శ్రేష్టము,
జ్ఞాన యోగము కంటెను ధ్యానమ్ము శ్రేష్టమై యుండు నెపుడు.

13. కర్మ ఫలముల విడుచుట కనుగొనగ ధ్యానమ్ము కన్న మేలు,
సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగ గూర్చును.

14. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు,
సుఖదుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడి వాడును.

15. దానంబు జేయువాడు మఱియును ధర్మంబు జేయువాడు,
ఓర్పు గల్గిన వాడును నేర్పుతో యోగంబు చేయువాడు.

16. కారుణ్య హృదయుండును కమలాక్షు సేవజేసెడు వాడును,
జ్ఞానంబు గల వాడును మఱియును ధ్యానంబు చేయువాడు.

17. అహము లేనట్టి వాడు అర్జునా మమత లేనట్టివాడు,
అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా.

18. పరుల కెప్పుడు భయమును ఫల్గునా కల్గింపనట్టివాడు,
పరుల చేతను భయమును పొందక భద్రముగ నుండువాడు.

19. సుఖదుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడి వాడును,
ద్వేషమది లేనివాడు దేనిని కోరకుండెటి వాడును.

20. మానావమానములను మహిలోన సమముగా జూచువాడు,
శత్రుమిత్రులనొకటిగా జూచెడు శాంత స్వరూపుండును

21. అత్యంత ప్రియుడు నాకు అర్జునా అంత్యమున నన్నెబొందు,
యీ ధర్మమార్గంబును విడవగా రాదు యెవ్వరికైనను

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన
గీతామృతమున ద్వాదశాధ్యాయము సమాప్తము.
ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః