శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన గీతామృతము


గీతామృతము
 శ్రీ సచ్చిదానందుడు రచియించె శ్రీ కరంబగు దీనిని
భక్తితో పఠియించిన గల్గును ముక్తి నిక్కంబుగాను


ఎచ్చటెచ్చట గీతలు ఉండునో అచ్చటచ్చట తప్పక
సర్వతీర్ధములుండును జగతిలో సత్యముగ నెల్లప్పుడు
ఉందురచ్చట దేవతల్‌ వుందురు యోగులును పన్నగులును
ఉందురచ్చట గోపికల్‌ వుందురు నారదుడు వుద్ధవుండు
సర్వదేవతలు ఋషులు యోగులును సాయంబు చేయుచుంద్రు
గోపాలగోపికలును గూర్తురు క్షేమంబు భక్తులకును

విజయుడును శ్రీ కృష్ణుడు వెలసిన తావులందున నెప్పుడు
నీతియును నైశ్వర్యము లక్ష్మియు నిక్కముగ నుండు జయము

దానము ధర్మమున్‌ దగువిధంబున జేసిన వార లెన్నడున్‌
గానరు కష్టముల్‌ భువిని గానరులేమిని నిశ్చయంబుగా
దానమె ప్రాణికోటులకు దాపని విత్తముగా నెఱింగివే
దానము జేయుడింక కలిదానము కంటెను బుణ్యమున్నదే


సత్యం వద                                        ఓం తత్‌ సత్‌                                     ధర్మం చర

దైవాత్మ స్వరూపులగు సోదరీ సోదరులకు ఒక్కమాట...!

సత్యాసత్యములను, ధర్మాధర్మములను నెఱుంగజాలక తన కర్తవ్యమును విస్మరించి, అస్త్రశస్త్రముల వీడి యుద్ధము చేయనని రధముపై కూలబడిన అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతను బోధించెను. కర్తవ్యమును గుర్తింప జేసెను, ధర్మమును స్థాపించెను. ధర్మమును స్థాపించుటకే భగవానుడు గీతను బోధించెను. నరనారాయణులు అవతారమూర్తులు. లోకమునకు ధర్మమును, స్థాపించు ఉపాయమును ఎఱిగించుటకే వారు అవతారములను దాల్చారు. వారే శ్రీకృష్ణార్జునులు వారెఱింగించినదే “శ్రీమద్భగవద్గీత” వారు ఈ గీత బోధకు నిమిత్తమాత్రులు. అందుకే గీతలో శ్రీకృష్ణభగవానుడిలా అన్నాడు. “ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” ఇంకా అర్జునుని గూర్చి యిలా అన్నాడు. “నిమిత్త మాత్రమ్‌ భవ సవ్యసాచిన్‌” అని ఈ వాక్యముల ద్వారా నర నారాయణులు అనగా కృష్ణార్జునులు ఇరువురు నిమిత్త మాత్రులని వేరే చెప్పనవసరం లేదు.

మానవాళి హృదయముల నావరించి, ధర్మము నణచి అధర్మమును బెంచు మాయను జయించి, ధర్మమును స్థాపించి, తద్వారా మోక్షరూపమగు శాంతిని నెలకొల్పునట్టి మార్గముల మానవాళికి ఎఱిగించుటకే గీతారూపమున ధర్మసూత్రములు బోధించిరి. అట్టి అమూల్యములగు ధర్మసూత్రములు గీర్వాణభాషయందుంటుచే సామాన్య విద్యావంతులకు సులభ సాధ్యము కాదు కదా? అందుచే గీతాసూత్రముల సతతము స్మరించుటకు వీలుగా నుండునట్లు వ్రాయవలసినదిగా అనేకమంది భక్తులు కోరిన కారణమున వ్యాకరణ కార్యము సహితము కొంతవరకు సడలించి స్త్రీలకు, పిన్నలకు, పెద్దలకు ఉపయుక్తముగా నుండునట్లు గీతామృతమును రచించితిమి. అట్టి గీతామృతమును గ్రోలి భక్తులు ముక్తులగుదురు గాక!
చరాచర సుఖాభిలాషి
సచ్చిదానంద పరమహంస స్వామి

లోకాస్సమస్తా సుఖినోభవంతు